పార్టీలో కాదు...సమాజంలోనే లోపం ఉంది: జానారెడ్డి

నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న సీనియర్ కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డి ఇవాళ్ళ హైదరాబాద్, గాంధీభవన్ ‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ తన ఆలోచనలను కుండబద్దలు కొట్టినట్లు అందరి ముందు ఉంచారు. 

“పార్టీలో నేతలు వర్గాలుగా చీలిపోయి ఒకరినొకరు దెబ్బ తీసుకొనేందుకు ప్రయత్నిస్తుండటం చాలా బాధాకరం. ఆ ప్రయత్నాలలోవారి అనుచరులు లేదా అభిమానులు సోషల్ మీడియాలో కెక్కి ఎదుటవ్యక్తిపై బురదజల్లడం, పరస్పరం దుష్ప్రచారం చేసుకోవడం ఇంకా బాధాకరం. నేతల మద్య ఏవైనా విబేధాలు లేదా అభిప్రాయబేధాలు ఉన్నట్లయితే పార్టీలో అంతరంగిక సమావేశాలలో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలే తప్ప ఈవిధంగా మీడియాకెక్కి పరస్పరం దుష్ప్రచారం చేసుకోవడం సరికాదు. దీని వలన వారికి జరిగే నష్టం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు జరిగే నష్టమే ఎక్కువని గ్రహిస్తే ఎవరూ ఈవిదంగా చేయరు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నవారుఎంతవారైనప్పటికీ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటుంటే ఎవరూ ఇటువంటి పనులు చేయరని నేను భావిస్తున్నాను. సోషల్ మీడియాలో జరుగుతున్నా ఈ పోరాటాలు, దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణం అందరినీ సమావేశపరిచి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను. 

ఏ సమస్య లేదా ఏ అంశంపైనైనా పార్టీ తరపున అందరూ ఏకాభిప్రాయంతో పనిచేయాల్సి ఉంటుంది. కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడటానికి పార్టీని తప్పు పట్టలేము... సమాజన్నే తప్పు పట్టవలసి ఉంటుందని భావిస్తున్నాను. ఒక పార్టీ...ఒక సిద్దాంతం పట్ల నమ్మకం లేనివారిని, ప్రజాస్వామ్యం పట్ల...తమను ఎన్నుకొన్న ప్రజల పట్ల గౌరవం లేనివారిని ప్రజలే ఆదరించి ఓట్లువేసి గెలిపిస్తున్నందునే ఈవిదంగా జరుగుతోంది తప్ప కాంగ్రెస్ పార్టీలో ఏదో లోపం చేత కాదు,” అని అన్నారు.