
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమంగా కనుమరగవుతున్నప్పటికీ, ఎన్నికల సమయంలో తన ఉనికిని చాటుకొంటూనే ఉంది. మార్చి 14న జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి కూడా పోటీ చేసేందుకు సిద్దపడింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పోటీ చేయబోతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన హిమాయత్ నగర్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు టిడిపి శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయబోతున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి, బిజెపి అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు, కాంగ్రెస్ అభ్యర్ధిగా చిన్నారెడ్డి, తెలంగాణ జనసమితి అభ్యర్ధిగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు టిడిపి తరపున ఎల్.రమణ కూడా బరిలో దిగబోతున్నారు. వీరు కాక స్వతంత్ర అభ్యర్ధులు ఉందనే ఉంటారు. కనుక వారందరి మద్య ఓట్లు చీలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని వలన ఏ పార్టీ లాభపడుతుందో... ఏది నష్టపోతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.
ఎన్నికల షెడ్యూల్:
ఫిబ్రవరి 16: నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 23: నామినేషన్లు దాఖలుకు చివరి రోజు
ఫిబ్రవరి 24: నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 26: నామినేషన్ల ఉపసంహరణ
మార్చి 14: పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
మార్చి 17: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.