ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఆస్తుల వివరాలు

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌లో తమ స్థిర, చర ఆస్తుల వివరాలను తెలిపారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్ర నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ2.06 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే మంచిర్యాలలో ఓ వ్యాపార సముదాయం, గోడౌన్ కూడా ఉన్నాయని తెలిపారు.  ఆయనకు ఎకో స్పోర్ట్స్ బిజినెస్ కూడా ఉంది. తన భార్య పేరు మీద 2018 సంవత్సరం మోడల్ ఇన్నోవా క్రెస్ట్ వాహనం ఉందని ప్రొఫెసర్ కోదండరాం అఫిడవిట్‌లో తెలిపారు.

తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.31.70 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ.18.54 కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.13.15 కోట్ల చర ఆస్తులున్నాయని తెలిపారు. తనకు సుమారు రూ. 4.10 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. 

వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమితో పాటు, మరో 32.10 ఎకరాలు, భార్య పేరు మీద మరో 10.2 7 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఇతర కుటుంబ సభ్యుల పేరిట మరో 41.39 ఎకరాల భూములున్నాయని తెలిపారు. షేక్‌పేట, బాగ్ అంబర్ పేట, శివంరోడ్‌లో కూడా ఆస్తులున్నాయని తెలిపారు. వరంగల్ జిల్లా షడాపల్లిలో కూడా ఉమ్మడి ఇండ్లు ఉన్నాయని తెలిపారు. కానీ తనకు సొంతకారు కూడా లేదని అఫిడవిట్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే తన భార్య పేరు మీద 2017 మోడల్‌ మారుతి ఏసి కారు ఉందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రాములు నాయక్ సమపృంచిన ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన వివరాల ప్రకారం  రూ. 1.88 కోట్లున్నాయి. దీనిలో రూ.40 లక్షల రూపాయలు చరాస్తులని తెలిపారు. తనకు సుమారు రూ.16.4 2 లక్షల అప్పులున్నట్లు తెలిపారు. తనకు 2014 సంవత్సరం మోడల్ ఇన్నోవా కారు, భార్య పేరు మీద నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఎర్రగడ్డలో ఓ ఇల్లు ఉన్నాయని రాములు నాయక్  ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు.

బిజెపి అభ్యర్ధి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి రూ.1.63 కోట్ల స్థిరాస్తులు, రూ.2.09 కోట్ల చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే వరంగల్ జిల్లా భీమారంలో తిరుమల సర్వీస్ సెంటర్ పేరుతో వ్యాపార సముదాయం కూడా ఉందని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో దామెరలో 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ప్రేమేందర్‌ రెడ్డి తనకు 2012 మోడల్ ఇన్నోవా కారు, అశోక్ లేలాండ్ ట్యాంకర్ ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు.

ఖమ్మం-వరంగల్-నల్గొండ-పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తుల వివరాలను పరిశీలించినట్లయితే అందరి కంటే టిఆర్ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయని స్పష్టం అవుతుంది. కానీ పాపం ఆయనకు సొంత కారు కూడా లేదు.