షర్మిళ పార్టీ పెడితే లోకం తలక్రిందులైపోదు: బిజెపి

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ తెలంగాణలో కొత్తపార్టీతో రాజకీయ ప్రవేశం చేస్తుండటంపై రాష్ట్రంలో పార్టీలు రకరకలుగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ఆమె బిజెపి సంధించిన బాణమని జగ్గారెడ్డి, బిజెపి దూకుడును అడ్డుకోవడానికి కేసీఆర్‌ సంధించిన బాణమని బిజెపి నేతలు, మళ్ళీ ఆంద్రా పాలకులు తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించడానికి వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్... ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. షర్మిళ తెలంగాణలోరాజకీయ ప్రవేశంపై ఏపీ బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం చాలా భిన్నంగా స్పందించారు. 

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్ షర్మిళ కొత్త పార్టీ పెడితే లోకం తలక్రిందులైపోదు. ఆమె రాజకీయ ప్రవేశంపై తెలంగాణ బిజెపి నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఆమె పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసిన తరువాత ఆమె ఏమి చేయబోతున్నారో అర్ధమవుతుంది. కొత్తపార్టీతో ఆమె ప్రవేశిస్తే తెలంగాణ రాజకీయాలలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూసిన తరువాత వారు మాట్లాడుతారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె ప్రవేశంతో ఏపీ రాజకీయాలకు సంబందం ఉందని నేను భావించడం లేదు,” అని అన్నారు.