
హైదరాబాద్ నగరంలో బోరబండలో బిజెపి, బజరంగ్దళ్ నేతలు, కార్యకర్తలు ఈరోజు మెరుపు ధర్నాకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు వారంరోజుల క్రితం బిజెపి, బజరంగ్దళ్ నేతలు స్థానిక బస్టాండ్ సమీపంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఎటువంటి అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసినందున పోలీసుల బందోబస్తు మద్య జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ విగ్రహాన్ని నేడు తొలగించారు. సమాచారం అందుకొన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా పలువురు బిజెపి, బజరంగ్దళ్, విశ్వహిందూపరిషత్, శివసేన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొని వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని చెదరగొట్టి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. దాంతో వారు అక్కడే బైటాయించి నిరసనలు తెలియజేసారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మద్య ఘర్షణ జరిగింది.
ఈరోజు ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను జరుపుకోవాలని బిజెపి, బజరంగ్దళ్ నేతలు భావించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొన్నారు. కానీ జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ అదే స్థానంలో విగ్రహాన్ని పెట్టేవరకు వెనక్కు తగ్గేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. విగ్రహాన్ని తొలగించినప్పటికీ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను అక్కడే జరుపుతామని బిజెపి, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, శివసేన నేతలు ప్రకటించడంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.