ప్రభుత్వ విశ్వసనీయత నిరూపించుకోవాలి : హైకోర్టు

హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న వామన్ రావు, నాగమణి దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు బుదవారం మధ్యాహ్నం నడిరోడ్డుపై కొడవళ్ళతో అతికిరాతకంగా హత్య చేయడాన్ని హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ తెలిపారు. ఈరోజు ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ హిమాకోహ్లీ స్పందిస్తూ, “న్యాయవాదుల హత్య రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉంది. కనుక ఈ కేసులో పోలీసులు పకడ్బందీగా అన్ని సాక్ష్యాధారాలు సేకరించి దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి,” అని అన్నారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేశారు. 

వామన్ రావు, నాగమణి దంపతుల హత్యలను ఖండిస్తూ హైకోర్టు బార్ అసోసియేష్ ఈరోజు విధులను బహిష్కరించి నిరసనలు తెలియజేస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోనే అన్ని న్యాయస్థానాలలోని న్యాయవాదులు కూడా విధులను బహిష్కరించి ఈరోజు ఉదయం నాంపల్లి నుంచి రాజ్‌భవన్‌కు పాదయాత్రగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకొనేందుకు  ప్రయత్నిస్తుండటంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. వామన్ రావు, నాగమణి దంపతులను హత్య చేసినవారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా విచారణ జరిపి దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. 

వామన్ రావు తండ్రి ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు టిఆర్ఎస్‌ నేత కుంట శ్రీనివాస్‌ను ఏ-1, అక్కపాక కుమార్-ఏ2, వసంతరావును ఏ3గా పేర్కొంటూ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన వెంటనే క్లూస్ టీం అక్కడకు చేరుకొని ఘటనాస్థలంలోని సాక్ష్యాధారాలను సేకరించారు. పోలీసులు పరిసర ప్రాంతాలలోని సిసి టీవీ రికార్డింగ్స్, నిందితుల కార్యకర్తలు డేటాను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.