
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో దళితులకు ప్రత్యేక దళిత్ స్టడీ సెంటర్‌ను నిర్మిస్తోంది. దీని నిర్మాణపనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఏప్రిల్ 14 వ తేదీన అంబేద్కర్ జయంతి రోజున ఈ భవనాన్ని ప్రారంభించేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి.
ఈ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ 26 కోట్లను కేటాయించింది. ఆరు అంతస్తులతో 1,500 చదరపు అడుగుల విస్తీరణంలో నిర్మిస్తున్న ఈ భవనం ముందు భాగంలో 28 అడుగుల ఎత్తైన డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌లో దేశంలో...రాష్ట్రంలో...దళితుల జీవన పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, అసమానతలు వంటి అంశాలను అధ్యయనం చేయడానికి అవసరమైన పెద్ద గ్రంధాలయం ఉంటుంది. తద్వారా దళితులలో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం.
ఈ భవనంలో డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను ఆవిష్కరించేవిధంగా ఆయన చిత్రపటాలు, ఆయన రచించిన అనేక పుస్తకాలతో కూడిన పెద్ద మ్యూజియం ఉంటుంది. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ లో పోటీ పరీక్షలకు హాజరయ్యే దళితుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వనున్నారు. ఒకేసారి 120 మందికి పైగా శిక్షణ ఇవ్వడంతోపాటు, భోజన, వసతి సౌకర్యం కూడా ఉండనుంది. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్‌గా మల్లేపల్లి లక్ష్మయ్య రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.