ప్రతిపక్షాల తీరు సరిగా లేదు: కల్వకుంట్ల కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని న్యాలకల్ రోడ్‌లో ఓ ఫంక్షన్ హాల్‌లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు, ఇతర తెరాస కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సద్విమర్శలు చేయాలే తప్ప ఇష్టారీతిన విమర్శలు చేయడం మానాలని హితవు పలికారు. ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి పనులను విమర్శించడం బిజెపి, కాంగ్రెస్‌లకు అలవాటుగా మారిందన్నారు. తెరాస శ్రేణులు కూడా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెరాసలో ప్రతి కార్యకర్తకు బీమా పథకం సీఎం కేసీఆర్‌ తెచ్చారని, ఇలాంటి పథకం మరే ఇతర పార్టీల కార్యకర్తలకు ఉందా? అని ఆమె ప్రశ్నించారు.

తెరాసకు కార్యకర్తలే బలమని అన్నారు. ప్రభుత్వం తెచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నా  విమర్శించేవారు కూడా ఉంటారన్నారు. రాష్ట్రం ఏర్పడక పూర్వం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుందని అన్నారు. తెరాస కార్యకర్తలు భేదాభిప్రాయాలను పక్కన పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.