ఇమేజ్ కోసం కాదు..పార్టీ కోసమే పాదయాత్ర: రేవంత్‌

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి రాజీవ్ రైతుభరోసా యాత్ర పాదయాత్రగా మారిన సంగతి తెలిసిందే. ఆయన తన ఇమేజ్ పెంచుకోవడం కోసమే పాదయాత్రలు చేస్తున్నారంటూ సొంతపార్టీలో నేతలే విమర్శిస్తున్నారు. అంతేకాదు..ఆయనకు పోటీగా భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇంకా మరికొంతమంది కాంగ్రెస్‌ నేతలు కూడా పాదయాత్రలకు సిద్దం అవుతున్నారు. ఈవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికివారే అన్నట్లు పాదయాత్రలు చేపడుతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రేవంత్‌ రెడ్డి తన పాదయాత్రలపై పార్టీలో వినిపిస్తున్న విమర్శలపై ఈరోజు ఆయన మాట్లాడారు. “నేను అచ్చంపేటలో రాజీవ్ రైతుభరోసా యాత్ర మొదలుపెట్టి రేపు (మంగళవారం) రావిరాలలో రణభేరీ సభతో ముగించబోతున్నాను. మా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నేను ఈ పాదయాత్ర మొదలుపెట్టాను తప్ప ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు. మా పార్టీలో మరికొందరు నేతలు వారివారి జిల్లాలలో పాదయాత్రలు చేస్తున్నారు. మా అందరి ఉద్దేశ్యం, లక్ష్యం ఒక్కటే. రైతు వ్యతిరేకవిధానాలు అవలంభిస్తున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయడం. కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతువ్యతిరేక చట్టాలను అడ్డుకోవడమే. మేము ఎవరితోనూ పోటీ పడటం లేదు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే మా పోరాటాలన్నీ,” అని అన్నారు.