హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం లేదు

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, లక్నో, చెన్నై, బెంగళూరు నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయాలని ఆలోచిస్తోందని ఆరోపించారు. ఓవైసీ ఆరోపణలనుకేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి  ఖండించారు. 

ఆదివారం హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం బిజెపి నిర్వహించింది.  ఖైరతాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన లేదన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లెందుకే ఇటువంటి అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఇటువంటి ఆరోపణలతో అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక పూర్వం పది జిల్లాల తెలంగాణను కాకుండా, రాయల తెలంగాణ అనే సరికొత్త వాదనను మజ్లీస్‌ పార్టీయే తెరమీదకు తీసుకువచ్చిందని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశంపై లోక్‌సభలో తాను సమాధానం చెప్పే సమయానికి అసదుద్దీన్ సభలలో లేకుండా బయటికి  వెళ్ళిపోయారని కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ కానీ మరే ఇతర నగరాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతం గా మార్చే ఆలోచన ఏదీ లేదన్నారు. జమ్మూ కశ్మీరులో నిరంతరం ఉగ్రవాదుల దాడుల కారణంగా ఆ రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చిందన్నారు.