మళ్ళీ సింగరేణిలో అడుగుపెట్టనున్న ఎమ్మెల్సీ కవిత

సింగరేణి గుర్తింపు సంఘం టిబిజీకేఎస్ సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీరాంపూర్ డివిజన్‌లోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన టిబిజీకేఎస్ సంఘం సమావేశంలో కల్వకుంట్ల కవితను గౌరవాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. టిబిజీకేఎస్ అధ్యక్షుడిగా బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు  ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 

గతంలో కల్వకుంట్ల కవిత టిబిజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అప్పుడు ఆమె స్వయంగా టిబిజీకేఎస్ తరపున యూనియన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అనేక హామీలు ఇచ్చారు. కానీ ఆ తరువాత ఎంపీగా ఉన్న తనకు యూనియన్ వ్యవహారాలు చూసేందుకు సమయం సరిపోవడం లేదంటూ ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. త్వరలో సింగరేణి యూనియన్ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆమె టిబిజీకేఎస్ సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఎన్నికైనందున ఈసారి కూడా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు.