మేయర్‌, డెప్యూటీ మేయర్‌ రెండూ టిఆర్ఎస్‌కే

గ్రేటర్ హైదరాబాద్‌ మేయర్‌గా టిఆర్ఎస్‌ బంజారాహిల్స్‌కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డెప్యూటీ మేయర్‌గా టిఆర్ఎస్‌ తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వారికి టిఆర్ఎస్‌ కార్పొరేటర్లతో పాటు మజ్లీస్‌ కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతు పలకడం విశేషం. కనుక ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతు అవసరం లేకుండానే టిఆర్ఎస్‌ రెండు పదవులను దక్కించుకోగలిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పరస్పరం కత్తులు దూసుకొన్న టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు మళ్ళీ చేతులు కలపడంతో బిజెపి మేయర్‌, డెప్యూటీ మేయర్‌ అభ్యర్ధులు ఎన్నికయ్యేందుకు అవకాశమే లేకుండా పోయింది. గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, మోతే శ్రీలత శోభన్ రెడ్డి డెప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌ వ్యవహరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ప్రకటించారు. వారిరువురి ఎన్నికను దృవీకరిస్తూ సర్టిఫికెట్లు కూడా అందజేశారు. మేయర్‌, డెప్యూటీ మేయర్‌ ఎన్నిక ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా సజావుగా పూర్తవడంతో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, మేయర్‌, డెప్యూటీ మేయర్ల గౌరవార్ధం జీహెచ్‌ఎంసీ ఆవరణలోనే విందుభోజనం ఏర్పాటు చేసింది.