
కొద్దిసేపటి క్రితం జీహెచ్‌ఎంసీ ప్రధానకార్యాలయంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలైంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈసారి పార్టీలవారీగా కాకుండా ముందుగా తెలుగు బాషలో, తరువాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు బాషలలో ప్రమాణస్వీకారం చేసేవారిగా విభజించి ఆ ప్రకారం చేయించారు. కొద్ది సేపటి క్రితమే ఈ కార్యక్రమం ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తయింది. మరికొద్ది సేపటిలో అంటే మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ మొదలుపెడతామని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. ఇదే అసలైన ఘట్టం.
మేయర్, డెప్యూటీ మేయర్ పదవులకు బిజెపి, మజ్లీస్ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ వాటికంటే టిఆర్ఎస్‌కు ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నందున ఆ రెండు పదవులూ టిఆర్ఎస్‌కే దక్కనున్నాయి. అయితే బిజెపి, మజ్లీస్ రెండు పార్టీలు పోటీ పడుతున్నందున ఈ ఎన్నిక సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మేయర్ పదవికి టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్ కార్పొరేటర్)ను, డెప్యూటీ మేయర్ పదవికి తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్లను సిఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.