ఖమ్మంలో కొత్త ఆర్టీసీ కాంప్లెక్స్

ఖమ్మం పట్టణంలో బైపాస్ రోడ్ వద్ద సిపిఐ కార్యాలయం వెనుక కొత్తగా నిర్మిస్తున్న ఆర్టీసీ కాంప్లెక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల కార్యాలయం, టికెట్ కౌంటర్, 15 దుకాణాల కొరకు గదుల నిర్మాణపనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం కాంప్లెక్స్ ఆవరణలో సిమెంట్ రోడ్డు పనులు, పైన రేకులు బిగించే పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే కాంప్లెక్స్ లోపల ఫ్లోరింగ్ (టైల్స్) పనులు మొదలుపెట్టబోతున్నారు. ఈ నెల 15లోగా పనులన్నీ పూర్తి చేయాలని ముందు అనుకొన్నప్పటికీ కరోనా..లాక్‌డౌన్‌ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. కనుక మార్చి15లోగా అన్ని పనులు పూర్తి చేసి కొత్త ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేయాలనే లక్ష్యంగా జోరుగా పనులు చేస్తున్నారు. 



హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్ తరువాత రాష్ట్రంలో అతిపెద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ ఇదే కాబోతోంది. ఎంజిబిఎస్‌కు ఏమాత్రం తీసిపోని విదంగా సువిశాలమైన స్థలంలో 30 ప్లాట్‌ఫారంలతో దీనిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణంపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ప్రత్యేకంగా శ్రద్ద చూపుతుండటంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.