రేపే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన?

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతీ శుక్రవారం రిటర్నింగ్ అధికారులతో సమావేశమవుతూ ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చిస్తోంది. ఇప్పటికే రెండు నియోజకవర్గాలలో తుది ఓటర్ల జాబితాలను ప్రకటించినందున రేపు జరుగబోయే సమావేశంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావుల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఆలోగా ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ మొదలు పోలింగ్ వరకు ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 3-4 వారాలు పడుతుంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినందున రేపు జరుగబోయే సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసి వెంటనే ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఎ కారణం చేతైనా రేపు ప్రకటించకపోతే మర్నాడు అంటే శనివారం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే తక్షణమే ఆ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కనుకనే సిఎం కేసీఆర్‌ నిన్న హాలియాలో బహిరంగ సభ నిర్వహించి నల్గొండ జిల్లా ప్రజలకు వరాలు ప్రకటించారని భావించవచ్చు.