
తెలంగాణ హైకోర్టు నిన్న సింగరేణి నియామకాలకు సంబందించి కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నెల 22న సింగరేణి సంస్థ పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. వాటిలో నర్స్ ఉద్యోగానికి కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సింగరేణి విధించిన ఈ నిబందనను సవాల్ చేస్తూ మహమ్మద్ ఫసీయుద్దీన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.
జస్టిస్ ప్రవీణ్ రావు బుధవారం ఈ కేసు విచారణ చేపట్టారు. సింగరేణి సంస్థ తరఫున న్యాయవాది నర్స్ ఉద్యోగాలకు మహిళలతోనే భర్తీ చేయడం ఆనవాయితీగా వస్తోందని కోర్టుకు విన్నవించారు. కానీ అది ఆనవాయితీ మాత్రమేనని కనుక నర్స్ ఉద్యోగాలకు పురుష అభ్యర్ధుల నుంచి కూడా దరఖాస్తులను తీసుకోవాలని జస్టిస్ ప్రవీణ్ రావు ఆదేశించారు. పురుష అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకొనేందుకు వీలుగా గడువును పెంచాలని, అలాగే ఉద్యోగాల భర్తీలో అర్హతలను బట్టి పురుషులకు కూడా అవకాశం ఇవ్వాలని హైకోర్టు సింగరేణి సంస్థను ఆదేశించింది.