మేయర్ పదవికి బిజెపి, మజ్లీస్‌ కూడా పోటీ

ఈరోజు హైదరాబాద్‌ మేయర్‌, డెప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగబోతోంది. వాటిని దక్కించుకొనేందుకు బిజెపి, మజ్లీస్‌ పార్టీలు కూడా రంగంలో దిగబోతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు 56, బిజెపికి 48 (వారిలో ఒకరు మృతి చెందారు కనుక 47), మజ్లీస్‌కు 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో జరుగబోతున్నందున ఎక్కువమంది సభ్యులున్న తమకే ఆ రెండు పదవులు దక్కడం ఖాయమని తెలిసి ఉన్నప్పటికీ టిఆర్ఎస్‌ పార్టీ ముందుజాగ్రత్త చర్యగా తన ఎక్స్‌అఫీషియో సభ్యులను (ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) కూడా రంగంలో దింపుతోంది. టిఆర్ఎస్‌కు 32, బిజెపికి 2, మజ్లీస్‌కు 10 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులున్నారు. కనుక ఎట్టి పరిస్థితులలో టిఆర్ఎస్‌ మేయర్‌, డెప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకోవడం ఖాయమని స్పష్టమవుతోంది. అయినప్పటికీ బిజెపి, మజ్లీస్‌ పార్టీలు కూడా తమ తమ అభ్యర్ధులను బరిలో దింపాలని నిర్ణయించి తమ కార్పొరేటర్లకు విప్‌లు జారీ చేశాయి. 

ఇంతవరకు మూడు పార్టీలు తమ మేయర్‌, డెప్యూటీ మేయర్‌ అభ్యర్ధుల పేర్లను ప్రకటించకపోయినా తాజా సమాచారం ప్రకారం టిఆర్ఎస్‌ మేయర్ అభ్యర్ధిగా గద్వాల్ విజ్వయలక్ష్మి, బిజెపి మేయర్ అభ్యర్ధిగా రాధా ధీరజ్ రెడ్డిల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మజ్లీస్‌ పార్టీ ఇంకా తన అభ్యర్ధుల పేర్లను బయటపెట్టలేదు. 

ఈరోజు ఉదయం 11 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన నాలుగు పార్టీల కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధ్యక్షతన మేయర్‌, డెప్యూటీ మేయర్‌ ఎన్నుకొంటారు. కోరం (కనీసం 97 మంది సభ్యులు హాజరు) ఉన్నట్లయితే మేయర్‌, డెప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వహిస్తారు లేకపోతే  మళ్ళీ రేపు సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ రేపు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన తేదీన జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశం నిర్వహించి ఎంతమంది హాజరైతే వారితోనే ప్రత్యక్ష పద్దతిలో మేయర్‌, డెప్యూటీ మేయర్లను ఎన్నుకొంటారు. 

అయితే మేయర్‌, డెప్యూటీ మేయర్‌ పదవులకు బిజెపి, మజ్లీస్‌ పార్టీలు కూడా పోటీ పడుతున్నందున ఈరోజు 149 సభ్యులు తప్పక హాజరయ్యి ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయడం ఖాయమనే భావించవచ్చు. కనుక మరో 3-4 గంటలలో హైదరాబాద్‌ కొత్త మేయర్ ఎవరో తెలిసిపోతుంది.   

మూడు పార్టీలు పోటీ పడుతునందున సమావేశంలో ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా జీహెచ్‌ఎంసీ కార్యాలయం లోపల బయటా భారీగా పోలీసులను మోహరించారు. కేవలం కార్పొరేటర్లను, ఎక్స్‌అఫీషియో సభ్యులను మాత్రమే లోపలకు అనుమతిస్తారు.