
ఈరోజు హాలియాలో జరిగిన సభలో సిఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు నిరసనలు తెలియజేయడంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి చిల్లరవేషాలు వేసేవారిని చాలామందిని చూశానని తక్షణమే లేచి వెళ్లిపోవాలని వారిని హెచ్చరించారు. వారిని సభ నుంచి బయటకు పంపేయమని సిఎం కేసీఆర్ పోలీసులను ఆదేశించారు. వారిని బయటకు పంపించివేసిన తరువాత సిఎం కేసీఆర్ తన ప్రసంగం కొనసాగిస్తూ, “కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ఒకటి రెండు ఎన్నికలలో గెలవడంతో బిజెపి నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో కొంతమంది నాయకులు కుక్కలు మొరిగినట్లు నోటికి వచ్చినట్లు మొరుగుతున్నారు. మా సహనానికి కూడా హద్దు ఉంటుందని వారు మరిచిపోరాదు. రాష్ట్రంలో మా బలం ముందు వాళ్ళ బలం ఏపాటి? మేము ఒకసారి కన్నెర్ర చేస్తే కనబడకుండా పోతారు. కనుక కాంగ్రెస్, బిజెపి నేతలు నోరు దగ్గరపెట్టుకొని మాట్లాడితే వారికే మంచిది. వారు చక్కగా సభ పెట్టుకొని తమ వాదనలను వినిపించి ప్రజలను మెప్పిస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మా సభలో వచ్చి అల్లరి చేస్తామంటే ఊరుకొనేది లేదు. మాపై పిచ్చికూతలు కూస్తామంటే భరించాల్సిన అవసరం మాకు లేదు. అటువంటి వారికి ఏవిధంగా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. గతంలో ఇంతకంటే పెద్దపెద్ద రాక్షసులతోనే పొరాడి గెలిచాము. కనుక మాకు మీరో లెక్క కాదు,” అని అన్నారు.
సిఎం కేసీఆర్ నాగార్జునసాగర్ పర్యటన సందర్భంగా బిజెపి కార్యకర్తలు ‘సిఎం కేసీఆర్ గోబ్యాక్...’ అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకోలు చేసేందుకు ప్రయత్నించారు. ఇటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన పోలీసులు వారినందరినీ పోలీస్ వ్యానులలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.