
టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పూల రవీంద్ర పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. పీఆర్టీయూ అధ్వర్యంలో ఉపాధ్యాయులు నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని వారు కోరుతూ కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చారు. వేతనసవరణ (పీఆర్సీ)లో కనీసం 45శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వారి ధర్నాలో పాల్గొనేందుకు రవీంద్ర వచ్చినప్పుడు తమ డిమాండ్స్, సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తున్నారని... ఏమీ చేయలేనప్పుడు అధికార టిఆర్ఎస్లో ఎందుకు కొనసాగుతున్నారంటూ ఉపాధ్యాయులు గట్టిగా నిలదీశారు. దాంతో ఆయన తీవ్రంగా స్పందిస్తూ టిఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వానికి తక్షణం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి పీఆర్టీయూ అధ్వర్యంలో పోరాడుతానని, తనకు టిఆర్ఎస్ కంటే పీఆర్టీయూ ముఖ్యమని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దామని, పీఆర్టీయూ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారందరితో రాజీనామాలు చేయించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదామని రవీంద్ర చెప్పడంతో ఉపాధ్యాయులు శాంతించారు.