
సిఎం కేసీఆర్ బుదవారం మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జునసాగర్ పరిధిలోని హాలియాలో బహిరంగసభలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి నెల్లికల్లు చేరుకొని అక్కడ ఒకేసారి తొమ్మిది ఎత్తిపోతల పధకాలకు శంఖుస్థాపన చేస్తారు. భోజన విరామం తరువాత మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలోని ఆలీనగర్ వద్ద బహిరంగసభలో పాల్గొంటారు.
నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద చివరి ఆయకట్టువరకు నీటిని అందించేందుకు, కృష్ణానది ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,04,600 ఎకరాలకు నీటిని అందించేందుకుగాను రూ. 2,395.68 కోట్లు వ్యయంతో 9 ఎత్తిపోతల పధకాలకు నేడు సిఎం కేసీఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీళ్ళు అందక బీడుభూములుగా మారుతున్న సారవంతమైన వ్యవసాయ భూములకు నీళ్ళను అందించాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆగస్ట్ 2003లో కేసీఆర్ ఆరు రోజులు పాదయాత్ర చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాను తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సాగునీటిని పారిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంటున్నందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల తరపున టిఆర్ఎస్ నేతలు సిఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుకొనేందుకు నేడు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెపుతున్నారు.
కానీ వరుసగా జరుగబోయే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిఎం కేసీఆర్ ఈ సభ నిర్వహిస్తున్నారని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈరోజు జరుగబోయే బహిరంగసభలో సిఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలపై తనదైన శైలిలో మాట్లాడి పార్టీ నేతలు కార్యకర్తలలో నూతనోతేజం కల్పించి, అలాగే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించి ప్రజలలో టిఆర్ఎస్ పట్ల మరింత నమ్మకం, అభిమానం పెరిగేలా ప్రయత్నించవచ్చు.