బిజెపికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్

హుజూర్‌నగర్‌ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం సూర్యాపేటలో సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం, పెదవీడు గ్రామం రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండాలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఈ దాడుల్లో స్థానికేతరులు పాల్గొన్నారని ఆరోపించారు. బిజెపి నేతలు రాజధాని నుండి నేర చరిత్ర గలవారిని రప్పించి దాడులకు పాల్పడిందని ఆరోపించారు. గుర్రంబోడు తండాలో సర్వేనెంబర్ 540 భూమి ఎక్కడ ఉందో బిజెపి నేతలకు తెలుసా...తెలిస్తే చూపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు, బిజెపి అధ్యక్షుడు కలిసి కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు.

గతంలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అట్ట పుస్తకాలను ఆయన అనుచరులుకు ఇప్పించారని ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడు చేసిన ఆరోపణలపై సైదిరెడ్డి స్పందిస్తూ తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ ఆరోపణలను నిరూపించలేకపోతే మీ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీని ప్రశ్నించారు.