కేసీఆర్‌పై కాంగ్రెస్‌, బిజెపిలు గవర్నర్‌కు ఫిర్యాదు

మొన్న ఆదివారం టిఆర్ఎస్‌ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో సిఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి మార్పు గురించి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలి చెప్పుతో సమానం...” అంటూ మాట్లాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై కాంగ్రెస్‌, బిజెపిలు స్పందిస్తూ, “రాజ్యాంగబద్దమైన ముఖ్యమంత్రి పదవి పట్ల సిఎం కేసీఆర్‌ ఇంత అగౌరవంగా మాట్లాడటం రాజ్యాంగాన్ని, ఆయనను ఎన్నుకొన్న నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమే. కనుక ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖలు వ్రాశారు. 

పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీలో ఉన్న ధర్మపురి అర్వింద్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు తగలడంతో పార్టీలో అసమ్మతి సెగలు రాజుకొన్నాయి. అప్పటి నుంచి తీవ్ర అభద్రతాభావంతో ఉన్న సిఎం కేసీఆర్‌ పార్టీలో అసమ్మతి నేతలను నియంత్రించేందుకే ఈ ముఖ్యమంత్రి మార్పు నాటకం ఆడించి దానికి మొన్న ముగింపు పలికినట్లు భావిస్తున్నాను. అసలు ఆయన  ఏ అధికారంతో ఎమ్మెల్యేలను ఆవిదంగా బెదిరిస్తున్నారు? ముఖ్యమంత్రి పదవిని కించపరుస్తూ కేసీఆర్‌ అన్న మాటలను ఖండిస్తున్నాను. ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ వ్రాశాను,” అని అన్నారు.