నాలుగేళ్ళ తరువాత తమిళనాడులో అడుగుపెట్టిన శశికళ

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ళు శిక్ష అనుభవించి విడుదలైన శశికళ సోమవారం తమిళనాడులో అడుగుపెట్టారు. ఆమె రోడ్డుమార్గం ద్వారా కారులో బెంగళూరు నుండి తమిళనాడు సరిహద్దులోని హోసూరుకి సోమవారం ఉదయం చేరుకొన్నారు.

ఆమెను అన్నాడీఎంకె పార్టీ నుంచి బహిష్కరించినట్లు సిఎం పళనిస్వామి ప్రకటించినప్పటికీ ఆమె తన కారుపై అన్నాడీఎంకె పార్టీ జెండాను పెట్టుకొని దారిలో అభిమానులకు అభివాదం చేస్తూ తమిళనాడు చేరుకొన్నారు. తద్వారా అన్నాడీఎంకె పార్టీ తనదేనని, త్వరలోనే ఆ పార్టీని, ప్రభుత్వాన్ని నిలువునా చీల్చడానికి ఆమె సిద్దం అవుతున్నట్లు తొలి సంకేతం పంపినట్లయింది. 

ఆమె కారుపై తమ పార్టీ జెండాను పెట్టుకొని ప్రయాణించడంపై అన్నాడీఎంకె పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ నేడో రేపో చెన్నైలో అడుగుపెట్టనున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు అన్నాడీఎంకె పార్టీలోనే కొందరు సన్నాహాలు చేస్తున్నారని ఆమె మేనల్లుడు దినకరన్ చెపుతున్నారు. ఆమె వెనుక నడిచేందుకు ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. కనుక శశికళ రాకతో ఇంతకాలం స్తబ్దుగా ఉన్న తమిళనాడు రాజకీయాలు మళ్ళీ ఒక్కసారిగా వేడెక్కనున్నాయి.