
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్ర బిజెపి నేతలు సూర్యపేట జిల్లాలో చేపట్టిన ‘గిరిజన భరోసా యాత్ర’ పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మద్య యుద్ధంతో ముగిసింది. దీనిలో పలువురు పోలీసులు, ఇన్స్పెక్టర్లు, లాఠీఛార్జీలో బిజెపి కార్యకర్తలు గాయపడ్డారు.
జిల్లాలోని మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండాలో సర్వే నెంబర్: 540లో భూములపై చాలా రోజులుగా వివాదం నెలకొంది. స్థానిక గిరిజనులు అక్కడ వ్యవసాయం చేసుకొనేవారు. వారిని బలవంతంగా ఖాళీ చేయించి ఆ స్థలంలో ఓ ప్రైవేట్ కంపెనీ షెడ్లు నిర్మించి తన అధీనంలో ఉంచుకొంది. దాంతో ఇరువర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ విషయం బండి సంజయ్ దృష్టికి రావడంతో నిన్న రాష్ట్ర బిజెపి నేతలతో కలిసి అక్కడకు వెళ్లారు. బిజెపి నేతలు ఆ ప్రదేశానికి వెళ్లినప్పుడు స్థానిక బిజెపి కార్యకర్తలు అత్యుత్సాహంతో ఆ షెడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇటువంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించగా వారిపై బిజెపి కార్యకర్తలు రాళ్ళు, కర్రలతో దాడులు చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అక్కడ కాసేపు యుద్ధవాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలలో ఇరువర్గాలు గాయపడ్డాయి.
అనంతరం బండి సంజయ్ గిరిజనులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఏడు దశాబ్ధాలుగా అడవిమృగాలతో పోరాడి ఈ భూములను బాగుచేసుకొని వ్యవసాయం చేసుకొంటున్న మిమ్మల్ని ఇక్కడ నుంచి పొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. మీకు అండగా నిలబడవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఈవిదంగా పోలీసులతో భయబ్రాంతులను చేస్తూ మీపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టిస్తుండటం చాలా దారుణం. ఈనెల 10న హాలియా సభలో సిఎం కేసీఆర్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తాం. గుర్రంబోడు భూములను ప్రభుత్వం తిరిగి మీకు అప్పగించేవరకు మేము పోరాడుతాం,” అని అన్నారు.