
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన నిన్న కోఠీలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో ఏప్రిల్ నెల తర్వాత అమలులోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ట్రంలో 26 లక్షల మందికి ప్రయోజనం చేకూరితే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 84 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని రాజేందర్ తెలిపారు. బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్కు తగినన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో పది కోట్ల రూపాయల పెట్టుబడితో క్యాన్సర్ రోగుల కోసం మరో 50 పడకల అదనంగా నిర్మించబోతున్నట్లు ఈటెల రాజేందర్ తెలిపారు.