5.jpg)
సిఎం కేసీఆర్ ఈనెల 10న నల్గొండ జిల్లాలోని హాలియాలో బహిరంగ సభ నిర్వహించి నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై బహిరంగ సభ గురించి చర్చించిన తరువాత తేదీ ఖరారు చేశారు. ఆదేరోజున జిల్లాలోని తొమ్మిది ఎత్తిపోతల పధకాలకు సిఎం కేసీఆర్ నెల్లికల్లులో ఒకే చోట శంఖుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని హుజూర్‌నగర్, మునుగోడు, కోదాడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నియోజకవర్గాల పరిధిలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లు ఖర్చు చేయబోతోంది. హాలియా బహిరంగ సభలో సిఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి పనులను ప్రకటించనున్నారు. అదే సభలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని ప్రజలకు పరిచయం చేసే అవకాశం ఉంది.
టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల ఆకస్మిక మృతితో ఈ ఉపఎన్నికలు జరుగుతున్నందున ఆ స్థానాన్ని మళ్ళీ ఆయన భార్య లేదా కుమారుడికి ఇవ్వాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దుబ్బాకలో ఈ సెంటిమెంట్ వల్ల నష్టపోయినందున ఈసారి వేరే బలమైన అభ్యర్ధికి ఇస్తే మంచిదనే అభిప్రాయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ టిఆర్ఎస్‌కు చెందిన నాగార్జునసాగర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితులలో గెలుచుకొని తీరాలని పట్టుదలగా ఉంది. లేకుంటే రాష్ట్రంలో టిఆర్ఎస్ బలహీనపడుతోందనే తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.జానారెడ్డి పోటీ చేయబోతున్నారు. బిజెపి అభ్యర్ధి ఇంకా ఖరారు కావలసి ఉంది.