
ప్రధాని నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ బుదవారం సాయంత్రం లక్నో విమానాశ్రయంలో ధర్నా చేశారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన తన అనుచరులను పోలీసులు అడ్డుకోవడమే కాక వారిని అరెస్ట్ చేసినందుకు నిరసన తెలియజేస్తూ కాసేపు ధర్నా చేశారు. వారిని పోలీస్స్టేషన్ నుంచి విడుదల చేసేవరకు విమానాశ్రయంలో నుంచి కదలనని ప్రహ్లాద్ మోడీ మొండికేసి కూర్చోవడంతో విమానాశ్రయ అధికారులు, పోలీస్ అధికారులు కంగారు పడ్డారు.
లక్నో విమానాశ్రయం అదనపు జనరల్ మేనేజర్ భూపేందర్ సింగ్ స్వయంగా వచ్చి ఆయన అనుచరులు గుంపుగా విమానాశ్రయంలోకి రాకుండా పోలీసులు అడ్డుకొన్నారు తప్ప ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఆయనకు నచ్చ చెప్పారు. కానీ తన అనుచరుడు జితేంద్ర తివారీని కూడా విడుదల చేయాలని పట్టుబట్టి కూర్చోన్నారు.
ప్రహ్లాద్ మోడీ ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుజరాత్ నుంచి ఇండిగో విమానంలో బుదవారం సాయంత్రం లక్నో వచ్చారు. అంతకు ముందే ఆయన ప్రధాన అనుచరుడు జితేంద్ర తివారీని సుల్తాన్పూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రహ్లాద్ తివారీ అధ్యక్షతన సుల్తాన్పూర్లో బహిరంగ సభ జరుగబోతోందని దానిలో ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పాల్గొంటారంటూ వారి ఫోటోలతో కూడిన పోస్టర్లు వేశాడు. అందుకు పోలీసులు జితేంద్ర తివారీని అరెస్ట్ చేశారు. అతనిని కూడా పోలీస్స్టేషన్ నుంచి విడిచిపెట్టిన తరువాత ప్రహ్లాద్ మోడీ శాంతించి వెళ్ళిపోయారు.