రాష్ట్రంలో రోజురోజుకు వాహనాల వాయుకాలుష్యం పెరుగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు గత ఏడాదే ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2020 -2030 పేరుతో ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే విద్యుత్ వాహనాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, రాష్ట్రంలో... ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వాటికి సర్వీసింగ్, ఛార్జింగ్ స్టేషన్లు సౌకర్యాలు లేకపోవడంతో విద్యుత్ వాహనాల అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విద్యుత్ వాహనాలకు రాయితీలను ప్రకటించింది. 1989 సం.లో తెచ్చిన మోటార్ వాహనాల చట్టం అనుసరించి విద్యుత్ వాహనాలకు రాయితీలు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే విద్యుత్ వాహనాలకు రోడ్డు పన్ను నుండి 100 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మోటార్ వాహనాల ద్వారా వాయుకాలుష్యం పెరుగుతుందని విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించిన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు ప్రత్యేక విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.