
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో చెల్లూరులో రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ రైతుబంధు పథకం సన్నకారు రైతులకు మాత్రమే పెడితే బాగుంటుందని అన్నారు. అలా కాకుండా పెద్ద భూస్వాములకు ఈ పథకం వర్తింపచేస్తే రాష్ట్ర ఆదాయానికి గండిపడే అవకాశం ఉందన్నారు. కాబట్టి పెద్ద భూస్వాములు అందరూ రైతుబంధు పథకాన్ని తీసుకోకుంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళకి, గుట్టలతో ఉన్న భూములకు, బంజరు భూములకు రైతుబంధు పథకం వర్తింపు చేయవద్దని సీఎం కేసీఆర్ కోరుతానని అన్నారు.
రైతు కొనుగోలు కేంద్రాలు యధావిధిగా కొనసాగుతుంటాయని హామీ ఇచ్చారు. రైతు ఉద్యమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, దేశానికి రైతులు, సైనికులు రెండు కళ్ళవంటివారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను ఈ పదవిలో ఉండొచ్చు... లేదా మరో ఇతర పదవిలో ఉండవచ్చు...కానీ రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.