ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ మేయర్ ఎన్నిక

ఈనెల 11వ తేదీన జీహెచ్‌ఎంసీలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో తొలిసమావేశం జరుగనుంది. ముందుగా సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. తరువాత తగినంతమంది సభ్యులు (కోరం) ఉన్నట్లయితే వెంటనే ప్రత్యక్ష పద్దతిలో మేయర్‌, డెప్యూటీ మేయర్‌లను ఎన్నుకొంటారు. ఒకవేళ కోరం లేకపోతే మర్నాడు ఎన్నిక జరుగుతుంది. మర్నాడు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘం సూచించిన రోజున కోరంతో సంబందం లేకుండా మేయర్‌, డెప్యూటీ మేయర్‌లను ఎన్నుకొంటారు. 

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి జీహెచ్‌ఎంసీ తొలి పాలకమండలి సమావేశానికి ప్రిసైడింగ్ ఆఫీసరుగా వ్యవహరించనున్నారు. కనుక ఆమె నిన్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్‌ కమీషనర్ లోకేష్ కుమార్, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి దీనిపై చర్చించారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌-56, బిజెపి-48, మజ్లీస్‌-44, కాంగ్రెస్ పార్టీ-2 సీట్లు గెలుచుకొన్న సంగతి తెలిసిందే. కనుక ఏ పార్టీ కూడా సొంతంగా మేయర్, డెప్యూటీ మేయర్ పదవులు దక్కించుకోలేవు. కానీ ఎంపీ, ఎమ్మెల్సీలు తదితరులు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఓట్లు వేసే వెసులుబాటు ఉన్నందున, వారి ఓట్లతో టిఆర్ఎస్‌ మేయర్ పదవిని దక్కించుకోవడం ఖాయమే. 

టిఆర్ఎస్‌ తరువాత బిజెపి అతిపెద్ద పార్టీగా నిలిచినందున....జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు దూరం జరిగినందున మూడు పార్టీలలో ఏ పార్టీకి డెప్యూటీ మేయర్ పదవి దక్కుతుందో చూడాలి.