
ఆదివారం వరంగల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి కార్యకర్తలు దాడులు, అందుకు ప్రతిగా బిజెపి కార్యాలయంపై టిఆర్ఎస్ దాడులు చేయడంపై వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోమవారం ఆయన వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న వరంగల్ నగరంలో బిజెపి, తెరాస పార్టీలు ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తుండటం చాలా బాధాకరమని అన్నారు. రెండు పార్టీలు త్వరలో జరగబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయా? అని ప్రశ్నించారు. వరంగల్లో గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరుగలేదని మొట్టమొదటిసారిగా భాజపా, తెరాసల వల్లననే నగరంలో అశాంతి, ఆరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఇప్పటికైనా భాజపా, తెరాసలు విద్వేషపూరితమైన ప్రసంగాలు మానుకోవాలని నాయిని రాజేందర్ హితవు పలికారు. వరంగల్ ప్రజలు కూడా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని వర్గాల వారిని కలుపుకుపోగల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు.