
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం భద్రాచల శ్రీరామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలంలో అతిముఖ్యమైన ఆరు మండలాలను కేంద్రప్రభుత్వం ఏపీలో కలపడం అనైతికమన్నారు. ఆ ఆరు మండలాలు భద్రాచలంలో ఉండి ఉంటే జిల్లా ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. తెలంగాణకు ఆరు మండలాలను తిరిగి ఇవ్వాలని లేదా కనీసం ఆరు పంచాయితీలైనా తిరిగి ఇవ్వాలని కేంద్రాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు వలన భద్రాచలం ముంపునకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వం,ఏపీ ప్రభుత్వాలదేనని అన్నారు. యాదాద్రి తరువాత భద్రాచలాన్ని ఆస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. భద్రాచలం పుణ్యక్షేత్రం అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.