కొనసాగుతున్న పీఆర్సీ సెగలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణ ప్రతిపాదనలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాద్యాయసంఘాలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నాయి. శనివారం ఉదయం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) తాత్కాలిక సచివాలయం బీఆర్‌కె భవన్‌ ఎదుట నిరసనలు చేపట్టింది. 

ప్రభుత్వం, పీఆర్సీ కమిటీ, త్రిసభ్య కమిటీ అందరూ కలిపి తమను మోసగించాలని ప్రయత్నిస్తున్నారని ఉపాద్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్న కొందరు ఉద్యోగసంఘాల నేతలతోనే త్రిసభ్య కమిటీ చర్చలు జరుపుతోందని, అన్ని ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తీసుకోకుండా ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా ఒప్పుకోమని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన 7.5 శాతం పీఆర్సీ తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కనీసం 45 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మాత్రం ఫిట్‌మెంట్‌ ప్రకటించేందుకు కమిటీలు దానికి మూడేళ్ళు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమకు న్యాయం చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

బీఆర్‌కె భవన్‌ ఎదుట రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి, పీఆర్సీ కమీషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఉపాద్యాయులను  పోలీసులు వ్యానులలో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.