
గత ఏడాది అక్టోబర్ నెలలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు రాజధాని హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాలలో వరదలొచ్చాయి. కనుక రూ.850 కోట్లు వరదసాయం మంజూరు చేయాలంటూ సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ వ్రాశారు. కానీ కేంద్రప్రభుత్వం రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చింది. తాజాగా మరో రూ.245 కోట్లు మంజూరు చేసింది. కేంద్రహోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ శుక్రవారం సమావేశమయ్యి వరదల వలన నష్టపోయిన తెలంగాణకు రూ.245కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.386.06కోట్లు, ఒడిశాకు రూ.320.94కోట్లు, అరుణాచల్ ప్రదేశ్‌కు రూ.75.86 కోట్లు మంజూరు చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద ఈ సాయాన్ని మంజూరు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2020-21లో దీని కింద 11 రాష్ట్రాలకు మొత్తం రూ. 4,409.71కోట్లు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 28 రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.19,036.43కోట్లు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.