
శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడు ధాటికి సమీపంలో నిలిపి ఉంచిన కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. సమాచారం అందుకొన్న ఢిల్లీ స్పెషల్ పోలీసులు, భద్రతాదళాలు వెంటనే అక్కడకు చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి పేలుడు జరిపిన వ్యక్తుల కోసం గాలింపు మొదలుపెట్టారు. బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడకు చేరుకొని పేలుడు జరిగిన చోట సాక్ష్యాధారాలను సేకరిస్తోంది. చుట్టుపక్కల మరెక్కడైనా బాంబులు అమర్చిఉన్నాయో లేదో కనుగొనేందుకు ఆ ప్రాంతానంతా జల్లెడ పడుతున్నారు. ఈ పేలుడుకు సంబందించి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దేశంలో ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, ఆసాంఘికశక్తుల కదలికలపై నిఘా బాగా పెరిగింది. దాంతో కశ్మీర్లో తప్ప దేశంలో మరెక్కడా ఉగ్రదాడులు, పేలుళ్లు జరుగకుండా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నివారించగలుగుతున్నాయి. ఈరోజు జరిగిన పేలుడు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగినందున దీని వెనుక ఏదైనా ఉగ్రవాదసంస్థ ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.