ఫిబ్రవరి 1కి పార్లమెంటు సమావేశాలు వాయిదా

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో నేటి నుండి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేంద్రప్రభుత్వం సకాలంలో లాక్‌డౌన్‌ విధించి అన్ని జాగ్రత్తలు పాటించడం వల్లనే దేశంలో కరోనా వైరస్‌ను సమర్ధంగా నియంత్రించగలిగామని, తద్వారా కోట్లాదిమంది ప్రాణాలు కాపాడుకోగలిగామని కోవింద్ అన్నారు. ఇప్పుడు యావత్ ప్రపంచదేశాలకు మనం కరోనా వ్యాక్సిన్‌ సరఫరా చేయగలిగే స్థాయికి ఎదిగామని అన్నారు. కరోనా...లాక్‌డౌన్‌ల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లినా కేంద్రప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు, ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో దేశంలో అన్ని రంగాలు మళ్ళీ కోలుకొన్నాయని అన్నారు. దేశంలో రైతులకు లబ్ది చేకూర్చేందుకే కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చిందని కానీ వాటిని నిరసిస్తూ గణతంత్రదినోత్సవం రోజున ఢిల్లీలో అల్లర్లు, విధ్వంసం జరగడం చాలా బాధాకరమని కోవింద్ అన్నారు. 

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగం ముగించుకొని వెళ్ళిపోయిన తరువాత కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ఆర్ధికసర్వే నివేదికను ప్రవేశపెట్టారు. దాని ప్రకారం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో కరోనా కారణంగా ఒక్క వ్యవసాయం తప్ప మిగిలిన అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయని, ఆ ప్రభావం వృద్ధిరేటుపై స్పష్టంగా కనిపించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో 2020-21 ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.7 శాతం ఉందని, కానీ ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి దాని నివారణకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చినందున దేశంలో మళ్ళీ అన్ని రంగాలు పుంజుకొన్నాయని తెలిపారు. 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో జీడీపీ వృద్ధి రేటు కనీసం 11 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేశారు. నిర్మలా సీతారామన్ ఆర్ధికసర్వేను ప్రవేశపెట్టిన తరువాత పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదాపడ్డాయి. ఆరోజున ఆమె 2021-2022 సంవత్సరాలకు బడ్జెట్‌ ప్రవేశపెడతారు.