కొత్త సచివాలయం ఎదుట 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయం ఎదుట 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రూ.146.50 కోట్లు వ్యయంతో సుమారు 11.4 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్లమెంటు భవనం నమూనాలో 50 అడుగుల ఎత్తు ఉండేలా పీటం నిర్మించి దానిపై 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ పీఠం నిర్మాణానికి రాజస్తాన్‌లోని దో ల్‌పూర్‌ నుంచి శాండ్ స్టోన్ తెప్పిస్తామని చెప్పారు. దేశంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలలోకెల్లా ఇదే అతిపెద్ద విగ్రహంగా నిలుస్తుందన్నారు.

ఈ ప్రాజెక్టులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితచరిత్రను తెలియజేసే ఫోటోలు, ఆర్ట్ గ్యాలరీ, ఆయన స్వయంగా వ్రాసిన పుస్తకాలు, ఆయన జీవిత విశేషాల గురించి తెలియజేసే పుస్తకాలతో కూడిన పెద్ద గ్రంధాలయం, ఎగ్జిబిషన్, ధ్యానమందిరం, ఆహ్లాదకరమైన పార్క్‌ వగైరాలు ఉంటాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబందించి ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని, ఆ సంస్థ నివేదిక ఇచ్చిన తరువాత సిఎం కేసీఆర్‌ అనుమతితో ముందుకు సాగుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.