ఇంతకీ అవి కేసీఆర్‌ మనసులో మాటలా లేక...

గత కొన్నిరోజులుగా టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. సాధారణంగా టిఆర్ఎస్‌లో రాజకీయ వ్యవహారాలు, వ్యూహాలు అన్నీకూడా సిఎం కేసీఆర్‌ సూచనల మేరకే జరుగుతుంటాయి... సిఎం కేసీఆర్‌ ఇచ్చిన లైన్ ప్రకారమే అందరూ మాట్లాడుతుంటారని అందరికీ తెలుసు. కనుక కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్న మాటలు కూడా సిఎం కేసీఆర్‌ సూచనలతో చేస్తున్నవిగానే భావించాల్సి ఉంటుంది లేదా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయబోతున్నట్లు ఆయన వారికి చెప్పడం వలననే వారు ధైర్యంగా ఆవిదంగా మాట్లాడుతున్నారనుకోవచ్చు. ఇటీవల ఓ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ “కాబోయే సిఎం కేటీఆర్‌గారికి ముందుగానే శుభాకాంక్షలు” అని కేటీఆర్‌ సమక్షంలోనే చెప్పినప్పుడు, కేటీఆర్‌ అందుకు కృతజ్ఞతలు చెప్పడం కానీ ఖండించడం గానీ చేయకపోవడం గమనిస్తే కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. అది ఎప్పుడు అనే విషయం పక్కనపెడితే, టిఆర్ఎస్‌ నేతల అత్యుత్సాహంతో మాట్లాడుతున్న మాటలు ప్రజలకు, ప్రతిపక్షాలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయని గ్రహించినట్లు లేదు. 

కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది...పార్టీలో యువనేతలు అందరూ కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నారు.... కేసీఆర్‌ జాతీయరాజకీయాలలోకి వెళ్తే బాగుంటుంది... అంటూ టిఆర్ఎస్‌ నేతలు మాట్లాడుతున్న మాటలు వారందరూ కేసీఆర్‌ తక్షణమే సిఎం పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని కోరుకొంటున్నారా?తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వని సిఎం కేసీఆర్‌ కంటే అందరితో స్నేహపూర్వకంగా చనువుగా మాట్లాడే కేటీఆర్‌ అయితేనే మంచిదని, ఆయనతో మాట్లాడుకొని వ్యవహారాలు చక్కబెట్టుకోవడం సులువని భావిస్తున్నందున ఈవంకతో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని నొక్కి చెపుతున్నారా?వంటి సందేహాలు కలుగుతున్నాయి. 

ఈ అంశంపై టిఆర్ఎస్‌ నేతల మాటలపై బండి సంజయ్‌ స్పందిస్తూ ఇదే ప్రశ్న అడిగారు. వారు కేసీఆర్‌అసంతృప్తిగా ఉన్నారా? అందుకే ఆయన దిగిపోవాలని కోరుకొంటున్నారా?కేసీఆర్ కంటే కేటీఆర్‌ సమర్దుడని భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కనుక కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం గురించి టిఆర్ఎస్‌ నేతలు ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. లేకుంటే ఇలాగే ప్రజలకు, ప్రతిపక్షాలకు కూడా తప్పుడు సంకేతాలు వెళతాయి. అప్పుడు ఇబ్బందిపడేది టిఆర్ఎస్‌ పార్టీయే అని మరిచిపోకూడదు.