
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటినుండి ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వివిధ పార్టీల నేతలు కూడా పీఆర్సీ నివేదికపై పెదవి విరిచారు.
తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతల తీరు సరిగాలేదని ఆక్షేపించారు. ఉద్యోగ సంఘాల నేతల కారణంగానే బిశ్వాల్ కమిటీ 7.5 పీఆర్సీ సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. కనుక ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నేతలు మేలుకొని 43 శాతం పీఆర్సీ పెంచేట్టు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలలో కలిపి సుమారు లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, తక్షణం ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో ప్రభుత్వోద్యోగుల పాత్ర సీఎం కేసీఆర్ గుర్తుంచుకొని వారికి న్యాయం చేయాలని సూచించారు.