వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ఉద్యోగులు నిరసనలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణ నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం వరంగల్‌, నల్గొండ జిల్లాలలో ఉద్యోగులు రోడ్లపై ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలియజేశారు. 

వరంగల్‌లోని ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ప్రకటించిన పీఆర్సీ ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గినమాట వాస్తవమే. కానీ 31 నెలల క్రితం బిశ్వాల్ కమిటీని ఏర్పాటుచేసినప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉండి ఉంటే అప్పుడే పీఆర్సీ ఇచ్చి ఉంటే నేడు ఇటువంటి కుంటిసాకులు చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు. సుమారు మూడేళ్ళపాటు కమిటీల పేరుతో కాలక్షేపం చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడం మమ్మల్ని అవమానించడంగానే భావిస్తున్నాము. అసలు దీనిని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో చెప్పాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బిశ్వాల్ కమిటీ నివేదికను పక్కను పెట్టి 45 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలని మేము సిఎం కేసీఆర్‌ను కోరుతున్నాము లేకుంటే ఆందోళనలు చేయడానికి వెనుకాడబోము,” అని అన్నారు. 

నల్గొండ జిల్లాలో ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ, “బిశ్వాల్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? ఈ మద్యకాలంలో మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఈ 31 నెలల్లో మారిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పుడో తయారుచేసిన నివేదికను ఇప్పుడు అమలుచేస్తామంటే మేము ఒప్పుకోము. ఇప్పటి పరిస్థితులను బట్టి వేతనసవరణ నిర్ణయించాలి. అసలు బిశ్వాల్ కమిటీకి మా సమస్యల గురించి ఏమి తెలుసని 7.5 శాతం ఫిట్‌మెంట్‌ సరిపోతుందని సిఫార్సు చేశారు?ఈ పీఆర్సీని మాకొద్దు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు.