
బుదవారం జరిగిన కరీంనగర్ మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో టిఆర్ఎస్, బిజెపి కార్పొరేటర్లు పరస్పరం తిట్టుకొని కొట్టుకొన్నారు. మేయర్ సునీల్ రావు అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం మొదలవగానే బిజెపి కార్పోరేటర్లు హరితహారం పధకం పేరిట తెరాస నేతలు ప్రజాధనం దోచుకొని తింటున్నారని ఆరోపిస్తూ ఎండిపోయిన మొక్కలను ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. మేయర్ పోడియంను ముట్టడించి, కోట్లు ఖర్చు చేసి లక్షల మొక్కలు నాటించామని గొప్పలు చెప్పుకొన్న మీరు..వాటిని ఎందుకు పట్టించుకోలేదంటూ మేయర్‌ను నిలదీశారు.
దాంతో టిఆర్ఎస్ కార్పొరేటర్లు వారిని అడ్డుకొనే ప్రయత్నించడంతో ఇరువర్గాల మద్య వాదనలు, నినాదాలు, తరువాత తిట్లు, తోపులాటలతో కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. బిజెపి కార్పొరేటర్ల తీరుపై మేయర్ సునీల్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘యూజ్ లెస్ ఫెలోస్’ అని అనడంతో వారు అక్కడే బైటాయించి మేయర్ క్షమాపణలు చెప్పాలని కోరుతూ నినాదాలతో సమావేశమందిరాన్ని హోరెత్తించారు. చివరికి పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాలను బయటకు పంపించడంతో కౌన్సిల్ సమావేశం అర్దాంతరంగా ముగిసింది.