పీఆర్సీ గురించి ఆందోళన వద్దు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ పీఆర్సీ గురించి ఉద్యోగులు ఆందోళన చెందవద్దని కోరారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ గ్రూప్ వన్ సంఘం అధికారుల సమావేశం జరిగింది. ఈ సంఘ సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇచ్చిన పీఆర్సీ నివేదికను చూసి ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని అన్నారు. కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది కావున ఉద్యోగులకు గతంలోలాగ ఫిట్‌మెంట్ ఇవ్వలేకపోతున్నామని కనుక ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు అడగకుండానే పీఆర్సీని ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. వేతనాల పెంపు విషయంలో బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను సిఎం కేసీఆర్‌ పరిగణలోకి తీసుకోకపోవచ్చునని, ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొంటారని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీలోగా అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇవ్వబోతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.