
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సిఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న హైదరాబాద్‌లోని కార్ఖానాలో అయోధ్య రామమందిర నిర్మాణం విరాళాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు పార్టీ నేతలు, కొత్తగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 11వ తేదీన అమావాస్య అని తెలిసినా జిహెచ్ఎంసి నూతనపాలకమండలికి ఆరోజు ముహూర్తం ఎందుకు పెట్టారని, ఎవరి ప్రోద్బలంతో అమావాస్య రోజున ఆ కార్యక్రమాన్ని పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీఎం కేసీఆర్ సచివాలయం వైపు కనీసం అడుగైన వేయలేదు. హైదరాబాద్, వరంగల్ నగరాలలో వరదలు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులుపడితే సీఎం కేసీఆర్ కనీసం వారిని పరామర్శించడానికి కూడా రాలేదని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం సచివాలయం నిర్మాణం ఏ విధంగా సాగుతుందని చూడడానికి వచ్చారని విమర్శించారు. కానీ ఇప్పుడు కొత్త సచివాలయం పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని, కమీషన్ల కోసమే దానిని కడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైనంపూడి సైదిరెడ్డిపై కూడా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. సైదిరెడ్డి ఎస్సీఎస్టీల భూములను అక్రమంగా లాక్కొని వారిని భయపెడుతున్నారని ఆరోపించారు. సైదిరెడ్డి ఆక్రమించిన భూములను తిరిగి ఎస్సీ, ఎస్టీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే త్వరలోనే భాజపా ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలతో ‘చలో హుజూర్‌నగర్’ కార్యక్రమం నిర్వహిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.