ఎల్లారెడ్డి మునిసిపల్ కమీషనర్‌పై సస్పెన్షన్ వేటు

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్లకు రాజకీయరంగు పులుముకుంది. వివరాల్లోకెళ్తే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మున్సిపాలిటీ పరిధిలో 39 మంది పేర్లను ఆసరా పెన్షన్ జాబితా నుండి తొలగించారు. మునిసిపల్ ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వెయ్యలేదనే అక్కసుతో 8వవార్డు కౌన్సిలర్ భర్త 39 మంది పేర్లను ఆసరా పెన్షన్‌ జాబితా నుండి తొలగింపజేశారు. బాధితులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో కలెక్టర్ శరత్ కుమార్ వెంటనే స్పందించి ఆసరా పెన్షన్లును చూస్తున్న కంప్యూటర్ ఆపరేటర్‌ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమ్మర్ అహ్మద్ ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించడంతో ఆయనను కూడా సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం 39 మంది పేర్లను మళ్ళీ ఆసరా పెన్షన్ జాబితాలో చేర్చి అందరికీ స్వయంగా పెన్షన్ బకాయిలు ఇప్పించారు.