తెలంగాణ కోసమే కేసీఆర్‌ పుట్టారు: కెకె

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్‌లో రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు త్రివర్ణపతాకం ఎగురవేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశ్యించి ఆయన మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తెలంగాణ కోసమే పుట్టారు. తెలంగాణకు ఆయన దేవుడిచ్చిన వరం... ప్రసాదం. ఆయన వల్లనే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2 లక్షలకు పైగా ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత తలసరి ఆదాయం లేదు. సిఎం కేసీఆర్‌ దూరదృష్టితో గత ఆరేళ్ళలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వంటి సాగునీటి ప్రాజెక్టుల వలన రాష్ట్రంలో వ్యవసాయం... దిగుబడి నాలుగు రెట్లు పెరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోను ఇంత తక్కువ సమయంలో అన్ని రంగాలలోను ఇన్ని మార్పులు, ఇంత అభివృద్ధి జరుగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తున్న సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో...మార్గదర్శకంలో అందరం కలిసి ముందుకు సాగుదాం. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకొందాం,” అని అన్నారు.