మన దేశంలో పాతవాహనాలపై గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఎనిమిది సంవత్సరాలు పైబడిన రవాణావాహనాల వల్ల ఎక్కువ వాయుకాలుష్యం ఏర్పడుతుండటంతో వాటిపై గ్రీన్ టాక్స్ విధించనున్నట్లు తెలిపారు. వాహనాలను రిజిస్ట్రేషన్, రెన్యూవల్ సర్టిఫికేషన్ పొందే సమయంలోనే ఈ గ్రీన్ టాక్స్ ను వసూలు చేయనున్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. గ్రీన్ టాక్స్ 10 నుంచి 25 శాతం వసూలు చేయనున్నట్లు సమాచారం. ప్రజలు ఉపయోగించే ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాలపై కొంత వెసులుబాటు కల్పించనున్నారు. ఇది సామాన్య ప్రజలకు ఊరట నిచ్చే విషయమే అని భావించవచ్చు. వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలలో మాత్రమే గ్రీన్ టాక్స్ 50శాతం వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు రవాణాశాఖ అధికారులు తెలిపారు.