ఎట్టకేలకు ఓటమి అంగీకరించిన జగన్‌ సర్కార్‌

ఏపీలో సుమారు 10 నెలలుగా జగన్ ప్రభుత్వానికి, ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మద్య కొనసాగిన యుద్ధంలో ఎట్టకేలకు నిమ్మగడ్డ గెలిచారు. జగన్ ప్రభుత్వం ఓటమి అంగీకరించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించింది. కరోనా భయాలు, వాక్సినేషన్ కారణంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేమని వాదిస్తున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కు తగ్గలేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత కూడా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం చెపుతున్న కుంటిసాకులను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా కొట్టివేసి తక్షణమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నేడు ఆదేశించింది. దాంతో జగన్ ప్రభుత్వానికి అన్ని దారులు మూసుకుపోయినట్లయ్యి ఎన్నికల కమీషనర్ ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపధ్యంలో ఏపీ ఎన్నికల సంఘం మళ్ళీ కొత్త ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.

తాజా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీ నుండి నాలుగు దశలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 9, 13,17, 21 తేదీలలో ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.