
కోరుట్ల టిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బిజెపి నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మెట్పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మనమెందుకు విరాళాలు ఇవ్వాలి? ఏం...ఇక్కడ రామాలయాలు లేవా? బిజెపి నేతలు రామాలయం పేరుతో వీధుల్లో బిక్షమెత్తుకొంటున్నారు. వారికి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు,” అని విద్యాసాగర్ రావు అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై బిజెపి కార్యకర్తలు భగ్గుమన్నారు. మెట్పల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మను తగులబెట్టారు. దాంతో టిఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మద్య కాసేపు వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపుతప్పకుండా నియంత్రించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో క్రమంగా బలపడుతున్న బిజెపిని ఏవిధంగా ఎదుర్కోవాలా అని టిఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తుంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈవిధంగా మాట్లాడి చేజేతులా ప్రభుత్వానికి, టిఆర్ఎస్కు మరో సమస్య తెచ్చి పెట్టారు. అంతేకాదు రాష్ట్రంలో బిజెపి ముందుకు సాగేందుకు మరో అవకాశం కల్పించినట్లయింది.