
పార్లమెంట్ సమావేశాలు దాదాపు సంవత్సర కాలంగా జరగలేదన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా జరగాల్సిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రద్దయ్యాయి. రాబోవు ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్న టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఆనవాయితీ ప్రకారం పార్లమెంటు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి.
మొదటి బడ్జెట్ సమావేశాలు జనవరి 29వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన 2021 -22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడతారు.
నేటికీ ఢిల్లీలో కరోనా వైరస్ ఉన్నందున పార్లమెంటు సభ్యులకు కరోనా సోకకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వాటిలో భాగంగా లోక్సభ, రాజ్యసభ సమావేశాలు వేర్వేరు సమయాలలో నిర్వహించబోతున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకూ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే సభ్యులందరూ తప్పనిసరిగా రెండు రోజుల ముందు కరోనా (ఆర్టిపిసిఆర్) టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే క్యాంటీన్ రాయితీలను ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సభ్యులకు కోవిడ్ టీకాలు ఇచ్చే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పార్లమెంట్ సభ్యులకు కూడా సామాన్య ప్రజలకు మాదిరిగానే వాక్సినేషన్ చేస్తారని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.