
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, శ్రేణులు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శాసనసభ నుండి రాజ్‌భవన్‌కు ‘ఛలో రాజ్‌భవన్’ పేరుతో పాదయాత్రగా బయలుదేరారు. కానీ వారిని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే బైటాయించి నిరసనలు తెలిపారు. దాంతో పోలీసులు వారినందరినీ వ్యానులలో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారు కనుక కేంద్రప్రభుత్వం వాటిని తక్షణమే వెనక్కు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతుంటే, పెట్రోలియం కంపెనీలు ఇష్టం వచ్చినట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకొంటూపోతూ సామాన్య ప్రజల జీవితాలు దుర్బరం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సిఎం కేసీఆర్ స్పందించడం లేదు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ బంద్ చేసినప్పుడు వారికి సహకరించిన పోలీసులు అదే సమస్యపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మమ్మల్ని ఎందుకు అడ్డుకొంటున్నారు?అరెస్ట్ చేస్తున్నారు? అయినా వ్యవసాయ చట్టాలను టిఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ పార్టీ చేయాల్సిన పోరాటాన్ని మా పార్టీ చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతోంది? సిఎం కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి,” అని అన్నారు.